: మా మామకు టికెట్ ఇవ్వొద్దు!... ఏఐసీసీకి లేఖ రాసిన సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంటిలో నేటి తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో పలు ఆసక్తికర విషయాలూ వెలుగుచూస్తున్నాయి. తనను, తన పిల్లలను భర్త, అత్తమామలు పట్టించుకోవడం లేదని రాజయ్య కోడలు సారిక కొన్ని నెలల క్రితం సెక్షన్ 498 కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా జరిగిన ప్రమాదంలో సారిక తన ముగ్గురు పిల్లలు సహా సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. పిల్లలతో సహా తనను పట్టించుకోని తన మామ సిరిసిల్ల రాజయ్యకు వరంగల్ లోక్ సభ టికెట్ ఇవ్వొద్దని సారిక ఏకంగా ఏఐసీసీకి మూడు రోజుల క్రితం లేఖ రాసిందట. అయితే సారిక లేఖ ఏఐసీసీ పెద్దలకు చేరిందో, లేదో తెలియదు కాని, రాజయ్యకే టికెట్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితమే వరంగల్ లోని తన ఇంటికి మకాం మార్చిన రాజయ్య, ఇంటికి వచ్చిన సందర్భంగానూ తన కోడలు సారికతో గొడవ పడ్డారట. గతంలోనూ ఆయన పలుమార్లు సారికతో గొడవ పడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇంటిలో ప్రమాదం చోటుచేసుకోవడం, ముగ్గురు పిల్లలతో కలిసి సారిక మంటలకు ఆహుతి అవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది.