: ప్రాణభయంతో పరుగులు తీసిన పిల్లలు... గది తలుపు వద్ద అగ్నికీలలకు ఆహుతి అయిన వైనం
మంచి నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా చెలరేగిన మంటలతో వేడి తగిలింది. లేచి చూస్తే గది నిండా మంటలు. ప్రాణభయంతో కేకలు వేస్తూ గది మొత్తం పరుగులు పెట్టారు. చివరకు గది తలుపు వద్దకూ ఎలాగోలా చేరుకున్నారు. అయితే అప్పటికే మంటలు చుట్టుముట్టాయి. తలుపు తీసేందుకు కుదరలేదు. దీంతో తలుపు వద్దే కుప్పకూలిపోయారు... ఇదీ సిరిసిల్ల రాజయ్య ముగ్గురు మనవలు అభినయ్, ఆయోన్, శ్రీయోన్ లు అనుభవించిన నరకయాతన. ఘటన గురించి తెలిసిన ఎవరినైనా కంటతడిపెట్టించే విధంగా ఉన్న ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు తమ తల్లితో కలిసి గదిలో చెలరేగిన మంటలకు ఆహుతి అయ్యారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంటిలో నేటి తెల్లవారుజామున చోటుచేసుకున్న అగ్ని ప్రమాదాన్ని పరిశీలించిన వరంగల్ నగర పోలీస్ కమిషనర్ షాక్ కు గురయ్యారు. ముగ్గురు పిల్లలు తలుపు వద్ద పూర్తిగా కాలిపోయిన స్థితిలో కనిపించడంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. పిల్లలు విగతజీవులుగా పడి ఉన్న వైనం అక్కడి వారిని తీవ్రంగా కలచివేసింది.