: డైలమాలో కాంగ్రెస్ అధిష్ఠానం... అభ్యర్థి మార్పు దిశగా స్థానిక నేతలతో ఫోన్ మంతనాలు
వరంగల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి మార్పు తప్పేలా లేదు. ఇప్పటికే పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను కాంగ్రెస్ తన అభ్యర్థిగా ప్రకటించింది. రోజుల తరబడి జరిగిన సంప్రదింపుల తర్వాత సిరిసిల్ల రాజయ్య అభ్యర్థిత్వం వైపు అధిష్ఠానం మొగ్గుచూపింది. స్థానిక నేతగానే కాక, ఇప్పటికే ఎంపీగా పనిచేసిన సిరిసిల్ల అయితేనే, టీఆర్ఎస్ ను సమర్ధంగా ఎదుర్కోగలమని భావించిన అధిష్ఠానం ఆయనను బరిలోకి దింపింది. అయితే నేటి తెల్లవారుజామున రాజయ్య ఇంటిలో చోటుచేసుకున్న దుర్ఘటనలో ఆయన కోడలు సారిక సహా ముగ్గురు మనవలు సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన నేపథ్యంలో సిరిసిల్ల రాజయ్య షాక్ కు గురయ్యారు. ఇంటి ఆవరణలోనే ఆయన కుప్పకూలిపోయారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధిష్ఠానం ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూనే ఎన్నికకు సంబంధించి డైలమాలో పడిపోయింది. రాజయ్య స్థానంలో మరో అభ్యర్థిని ప్రకటించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు స్థానిక నేతలతో అధిష్ఠానం పెద్దలు ఫోన్ మంతనాలు సాగిస్తున్నారు. దీనిపై మీడియాతో మాట్లాడిన టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో గంటలో ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.