: సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న 'రియల్ హీరో' వీడియో
నడుం లోతు నీరు వేగంగా ప్రవహిస్తోంది. ఏది రోడ్డో... ఏది మ్యాన్ హోలో తెలియని పరిస్థితి. ఆ వరదలో ఓ బస్సు చిక్కుకుంది. ఆ బస్సులో ఓ వృద్ధురాలు కూడా వుంది. ఇంతలో నీట్ గా ఇన్ షర్ట్ చేసుకుని వున్న ఓ వ్యక్తి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ నీటిలో నేరుగా ఆమె వద్దకెళ్లి, అమాంతం ఆమెను పైకెత్తుకుని ఆ వరద నీటిని దాటించాడు. ఆమెను మాత్రమే కాకుండా, ఆ బస్సులో చిక్కుకున్న మరికొంత మందిని కూడా రక్షించాడు. గత కొంత కాలంగా చెన్నైని వర్షాలు వణికిస్తున్నాయి. తమిళనాడులో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. దీనిని ఓ వ్యక్తి షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టగా, 'చెన్నై రియల్ హీరో' అంటూ అంతా అభినందిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.