: ఆరు రోజుల తరువాత స్వల్ప లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు
ఆరు వరుస సెషన్లలో నష్టాల తరువాత భారత స్టాక్ మార్కెట్ లాభాల బాట పట్టింది. అయితే, ఆరంభంలోని భారీ లాభాలు, సెషన్ గడిచేకొద్దీ తగ్గుతూ వచ్చాయి. ఒకదశలో నష్టాల్లోకి వెళ్లిన సూచికలు ఆపై లాభాల్లోకి వచ్చినప్పటికీ, ఒడిదుడుకుల మధ్య సాగి నామమాత్రపు లాభాలకు పరిమితమయ్యాయి. మంగళవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ 31.44 పాయింట్లు పెరిగి 0.12 శాతం లాభంతో 26,590.59 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 9.90 పాయింట్లు పెరిగి 0.12 శాతం నష్టంతో 8,060.70 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.28 శాతం, స్మాల్ క్యాప్ 0.39 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 24 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, ఏసీసీ, ఎంఅండ్ఎం, హిందాల్కో తదితర కంపెనీలు లాభపడగా, ఆసియన్ పెయింట్స్, లుపిన్, టాటా స్టీల్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్ తదితర కంపెనీలు నష్టపోయాయి. సోమవారం నాడు బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 98,23,603 కోట్లుగా ఉండగా, అది నేడు రూ. 98,61,261 కోట్లకు పెరిగింది. మొత్తం 2,827 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1482 కంపెనీలు లాభాలను, 1,217 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.