: ఆహార పదార్థాల కోసం న్యూస్ పేపర్ అస్సలు వాడొద్దు!
టీవీలలో ప్రసారమయ్యే వంటల ప్రోగ్రాంలో నూనెతో వంటలు పూర్తి చేసిన తరువాత నూనె పీల్చుకునేందుకు పేపర్ ను వాడుతారు. ఇలాంటి సందర్భాల్లో సరైన అవగాహన లేకుండా కొంత మంది పేపర్ నూనెను పీల్చుకుంటుందని, అందుకే పేపర్ వాడమని సలహా ఇస్తుంటారు. అయితే వారు చెప్పే పేపర్ 'టిష్యూ పేపర్' అని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. టిష్యూలు కొని వాడే అలవాటు లేని వారు ఏదైతే ఏంటి, పేపరే కదా అనే భావనతో న్యూస్ పేపర్ ను వినియోగిస్తుంటారు. సాధారణంగా రోడ్డు పక్కన వంటలు వండే వారు ఈ విధానం అవలంబిస్తుంటారు. న్యూస్ పేపర్ పై నూనెతో వండిన పదార్థాలు పెట్టడం వల్ల ఆరోగ్యానికి చేటు అని వారు వివరిస్తున్నారు. న్యూస్ పేపర్ లో అక్షరాలు ప్రింట్ చేసే రంగులో గ్రాఫైట్ వినియోగిస్తారని, నూనెలో ఆ గ్రాఫైట్ కలిసిపోతే మూత్రపిండాలు, కాలేయం, ఎముకలు, కణజాలం పనితీరుపై ప్రభావం చూపుతుందని వారు పేర్కొంటున్నారు. ఎలాంటి హానికారకాన్నైనా విసర్జించే శరీరం గ్రాఫైట్ ను విసర్జించ లేదని, తద్వారా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. పేపర్ తడవనంత వరకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఒకసారి తడిస్తే గ్రాఫైట్ ఇతర పదార్థాలకు అతుక్కుపోతుందని వారు హెచ్చరిస్తున్నారు.