: రంగా హత్యపై అప్పుడు హోం మంత్రిగా ఉండి ఇప్పుడీ మాటలెందుకో?: బోండా ఉమ
మాజీ మంత్రి హరిరామ జోగయ్య విడుదల చేసిన పుస్తకంలో అసలు వాస్తవాలే లేవని తెలుగుదేశం నేత బోండా ఉమ వ్యాఖ్యానించారు. వంగవీటి మోహన రంగా హత్య గురించి ముందే సమాచారం తెలిసివుంటే, ఆనాడు హోం మంత్రిగా ఉన్న ఇదే హరిరామ జోగయ్య ఎందుకు అడ్డుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన, రంగా హత్యపై ఆధారాల్లేవని అప్పట్లో ఆయన కుటుంబమే అంగీకరించిందని, ఇప్పుడు జోగయ్య ఇలా ఎందుకు మాట్లాడారో అర్థం కావడం లేదని ఉమ అన్నారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. రాష్ట్రం నిధులలేమిలో ఉన్నప్పటికీ, నిధులిచ్చేందుకు అంగీకరించిన ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. కాగా, మరోవైపు హరిరామ జోగయ్య రాసినది ఆత్మకథ కాదు, అబద్ధాల కథ అని కాపు సంఘం జాతీయ అధ్యక్షుడు రామానుజయ దుయ్యబట్టారు. ఆత్మకథైతే తన భార్య ఆత్మహత్యాయత్నం విషయాన్ని ఆయన ఎందుకు ప్రస్తావించలేదని ఆయన ప్రశ్నించారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు జోగయ్య ప్రయత్నిస్తున్నాడని, దీన్ని అడ్డుకుంటామని ఆయన అన్నారు.