: భారత్ లో గూగుల్ 'ప్రాజెక్ట్ లూన్ ఎయిర్ బెలూన్' సేవలు
ప్రముఖ సెర్చింజిన్ సంస్థ గూగుల్ ఇంటర్నెట్ ను ఓ సరికొత్త ప్రాజెక్టు రూపంలో అందించబోతోంది. గాలిలో ఎగిరే ఎయిర్ బెలూన్ల ద్వారా భారత్ లోని వినియోగదారులకు అంతర్జాలాన్ని అందించేందుకు సిద్ధమైంది. 'ప్రాజెక్ట్ లూన్' పేరిట తీసుకురానున్న ఈ సేవలను బీఎస్ఎన్ఎల్ తో కలసి అందించనుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపినట్టు సమాచారం. భూమి ఉపరితలానికి 20 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతూ ఆయా డివైస్ లకు ఈ బెలూన్లు ఇంటర్నెట్ సేవలను అందిస్తాయి. 4జీ టెక్నాలజీకి సమానంగా వాటిలో ఇంటర్నెట్ స్పీడ్ ఉంటుంది. చుట్టూ 40 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 4జీ డివైస్ లకు బెలూన్లు కమ్యూనికేట్ అవుతాయి. దాంతో ఏ ప్రదేశంలోనైనా అత్యధిక వేగంతో కూడిన 4జీ సేవలను వినియోగదారులు పొందవచ్చు. ప్రస్తుతం ఈ సేవలను న్యూజిలాండ్, యూఎస్ఏలోని కాలిఫోర్నియా, బ్రెజిల్ వంటి నగరాల్లో పైలెట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించింది. త్వరలోనే భారతదేశంలో కూడా గూగుల్ ఈ సేవలను ప్రారంభించనుంది.