: కేసీఆర్ పై జైపాల్ రెడ్డి ఫైర్... డిప్యూటీ సీఎంలను బానిసలుగా చూస్తున్నారని ఆరోపణ
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి విరుచుకుపడ్డారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ రాజకీయాలను జూదంగా మార్చిందని జైపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించుకున్న కేసీఆర్, వారిని బానిసలుగా చూస్తున్నారని ఆరోపించారు. వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ను ఓడించి కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఇచ్చిన సోనియా గాంధీకి వరంగల్ స్థానాన్ని కానుకగా ఇస్తామని ఆయన పేర్కొన్నారు. వరంగల్ ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చినా తాము స్వాగతిస్తామని కూడా జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.