: 'మేకిన్ ఇండియా' సాఫల్యానికి అమెరికా ఇస్తున్న సలహా ఇది!
భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన 'మేకిన్ ఇండియా' విజయవంతం కావాలంటే, సంస్కరణల అమలు వేగవంతం కావాలని, ఈ దిశగా ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తేనే ఫలితాలను చూడవచ్చని అమెరికా వాణిజ్య సంఘం 'అలయన్స్ ఫర్ ఫెయిర్ ట్రేడ్ విత్ ఇండియా' (ఏఎఫ్టీఐ) సలహా ఇచ్చింది. విదేశీ పెట్టుబడులు ఇండియాకు రావాలంటే స్నేహపూర్వక వాతావరణం తప్పనిసరని, ఆ పరిస్థితి కల్పించడంలో మోదీ విఫలమైతే, పోటీ ప్రపంచంలో ఇన్వెస్ట్ మెంట్స్ మరో దేశానికి వెళ్లిపోతాయని ఏఎఫ్టీఐ హెచ్చరించింది. ప్రపంచ స్థాయి నియంత్రణా నిబంధనలను, ఐపీ (ఇంటలెక్చువల్ ప్రాపర్టీ) ప్రమాణాలను పాటించడంలో ఇండియా విఫలమవుతోందని, ఎన్నో ఏళ్లుగా కీలక సంస్కరణల అమలు వాయిదా పడుతూ వస్తోందని ఆరోపించింది. గత వారంలో జరిగిన 'భారత్ - అమెరికా వాణిజ్య విధానం' సమావేశం సైతం నిరుత్సాహకరంగానే సాగిందని ఏఎఫ్టీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇరు దేశాల వ్యాపారవేత్తలు ఎటువంటి నిర్ణయాలూ తీసుకోలేదని, భారత ప్రభుత్వం పాటించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం కొరవడిందని వెల్లడించింది. అందివచ్చే అవకాశాలను చేజార్చుకుంటే ఇండియాకే నష్టమని హెచ్చరించింది.