: హెచ్-1బీ వీసాల సంఖ్య పెంచి పెద్ద తప్పు చేశాం: మైక్ హుకాబీ
అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసాల సంఖ్యను పెంచి పెద్ద తప్పు చేసిందని అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడతారని భావిస్తున్న మైక్ హుకాబీ విమర్శించారు. ఈ వీసాల పెంపుదల వల్ల దేశానికి వస్తున్న విదేశీయుల సంఖ్య పెరిగిపోగా, స్థానికులకు ఉపాధి దూరమైందని రిపబ్లికన్ పార్టీ తరఫున యూఎస్ ప్రెసిడెంట్ గా పోటీ చేయాలని భావిస్తున్న మైక్ ఆరోపించారు. ఇప్పటికే అమెరికాలో ఎంతో మంది ఉద్యోగాలను కోల్పోయారని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో డిస్నీలో జరిగిన నిరసనలను గురించి ఆయన ప్రస్తావించారు. ఎన్నో సంస్థల్లో తక్కువ వేతనాలకు హెచ్-1బీ వీసాలపై విదేశీ ఉద్యోగులను తెచ్చుకుంటున్నారని, దీని వల్ల అమెరికన్లకు పూట గడవడం లేదని ఆయన అన్నారు. అమెరికన్ యువతలో నైపుణ్యాలున్నప్పటికీ, వారికి ఉపాధి దూరమైందని ఆరోపించారు. "ప్రస్తుతం అమెరికా ఎదుర్కొంటున్న నిజమైన సవాళ్లలో ముఖ్యమైనది ఇతర దేశాల నుంచి వలస వస్తున్న ఉద్యోగులే. ఇది ఎంతమాత్రమూ సమంజసం కాదు. ఈ పరిస్థితి మారాలి" అని ఆయన అన్నారు.