: ఏటీఎంను వాడేటప్పుడు ఈ జాగ్రత్తలతో మీరు సేఫ్!
ఆన్ లైన్ మోసాలు పెరుగుతున్న రోజులివి. అంతేకాదు, ఎటీఎంలలో కార్డులు పెట్టే స్లాట్లపై ఓ పరికరాన్ని ఉంచి కార్డుల డేటాను దొంగిలించి వాటిని క్లోనింగ్ చేసిన కేసులూ మనం చూశాం. కార్డు పాస్ వర్డ్ కోసం కొందరు ఏటీఎం ఉంచే గది పైకప్పుల్లో కెమెరాలను కూడా అమర్చారని మనకు తెలుసు. కష్టపడి పనిచేసి ప్రతిఫలంగా పొందే డబ్బు, అక్రమార్కుల చేతుల్లోకి వెళితే ఎంతో బాధ. దాన్ని దూరం చేసుకోవాలంటే, కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఏటీఎంను వాడేవాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలివి. * పిన్ నంబరును కేవలం మనసులో గుర్తు పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్డుపై పిన్ నంబర్ రాయకూడదు. * క్రెడిట్ లేదా డెబిట్ కార్డు మీ వ్యక్తిగత వినియోగానికి సంబంధించినది. ఎంత దగ్గరి వారైనా, కుటుంబ సభ్యులైనా, స్నేహితులైనా వారికి పిన్ నంబరు చెప్పకపోవడమే మంచిది. * ఏటీఎంను వాడేటప్పుడు మెషీన్ కు దగ్గరగా నిలవాలి. పిన్ నంబర్ కొట్టేటప్పుడు రెండో చేతిని అడ్డుగా పెట్టుకోవాలి. * ఏటీఎం వద్ద ఏదైనా సహాయం కావాలనిపిస్తే, అపరిచితుల నుంచి పొందకూడదు. * లావాదేవీ ముగిసిన వెంటనే ఏటీఎంలోని క్యాన్సిల్ బటన్ నొక్కాకనే బయటకు రావాలి. మీ కార్డు, లావాదేవీ స్లిప్ తీసుకోవడం మరువరాదు. * మీ కార్డు పోగొట్టుకుంటే, మరుక్షణమే బ్యాంకుకు తెలియజేయాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే, మీ డబ్బులు మీకే ఉపయోగపడతాయి. ఏదైనా అజాగ్రత్తతో ఉండి, కార్డు వివరాలు దోపిడీదారులకు తెలిస్తే, ఖాతా ఖాళీ అవుతుందని మరువద్దు.