: వారసత్వపు ఆస్తిపై మహిళల హక్కుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు!
తమ తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తిలో తమకూ భాగం ఇవ్వాలని ఏళ్లుగా పోరాడుతున్న భారత మహిళలకు నిరుత్సాహాన్ని కలిగించే వార్త. వారసత్వపు ఆస్తిపై చట్ట సవరణ జరిగిన సెప్టెంబరు 9, 2005 నాటి కన్నా ముందు తండ్రి మరణిస్తే, ఆ ఆస్తిపై ఆడపిల్లలకు హక్కులు ఉండవని సుప్రీంకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. చట్ట సవరణ అమల్లోకి వచ్చిన తరువాతి కేసుల్లోనే ఆస్తిపై మహిళలకు హక్కులు సంక్రమిస్తాయని వెల్లడించింది. వారసత్వంగా వచ్చిన ఆస్తిలో తనకూ వాటా ఇవ్వాలని ఓ హిందూ మహిళ కోర్టును ఆశ్రయించగా, జస్టిస్ అనిల్ ఆర్ దావే, జస్టిస్ ఆదర్శ్ కే గోయల్ లతో కూడిన బెంచ్ కేసును విచారించింది. తాను అవిభాజ్య హిందూ కుటుంబానికి చెందినదాన్నని ఆ మహిళ వాదించగా, కుటుంబం ఎలాంటిదైనా చట్ట సవరణ అమల్లోకి వచ్చిన తేదీని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. దీంతో వివిధ రాష్ట్రాల్లోని పలు కోర్టుల్లో దీర్ఘకాలంగా నలుగుతున్న ఇదే తరహా కేసులు పరిష్కారమయ్యే మార్గం దొరికినట్లయింది.