: ‘చిరుత’ కంటే నేనే ఫాస్ట్!... ధోనీ ప్రశ్నకు గేల్ సరదా సమాధానం
పరుగు పందెంలో జమైకా స్టార్ ఉసేన్ బోల్ట్ ను మించిన వేగం దాదాపుగా అసాధ్యం. అయితే అతడి కంటే నేనే ఫాస్ట్ అంటున్నాడు విండీస్ పించ్ హిట్టర్ క్రిస్ గేల్. నిజమేనా?.., అంటే నిజమే. స్వయంగా క్రిస్ గేల్ ఈ విషయాన్ని చెప్పాడు మరి. ఉసేన్ బోల్ట్ ఎక్కడా? గేల్ ఎక్కడ అనేగా మీ డౌటు?... నిజమే, పరుగులో ఉసేన్ బోల్ట్ కింగ్ అయితే, క్రికెట్ లో గేల్ కింగ్. మరి బోల్ట్ తో గేల్ తనను తాను ఎందుకు పోల్చుకున్నాడు? ధోనీ సరదా ప్రశ్నకు గేల్ అంతే సరదాగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయాన్ని అతడు ప్రస్తావించాడు. అసలు విషయమేంటంటే... నిన్న ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కెప్టెన్ కూల్ ధోనీ, క్రిస్ గేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది. ఈ భూమిపై అత్యంత వేగంగా పరుగెత్తే అథ్లెట్ ఎవరు? అని ధోనీ ప్రశ్నించాడట. దీనికి వేగంగా స్పందించిన గేల్ తానేనని సమాధానం చెప్పేశాడు. దీంతో ధోనీ ఆశ్చర్యంగా అతడి వంక చూడగా ‘‘బోల్ట్ క్రికెట్ ఆడలేడు. నేను మాత్రం అతడి కంటే వేగంగా పరుగెత్తగలను. ఏదో ఒక రోజు ఈ అవకాశం వస్తుందని ఆశిస్తున్నా. అయితే ఇది ఎప్పటికీ జరగదు’’ అంటూ కాస్తంత సీరియస్ ముఖం పెట్టి గేల్ చెప్పిన సమాధానానికి ధోనీ సరదాగా నవ్వేశాడు.