: ‘ఓరుగల్లు’ సిత్రాలు... నేతల ఆలింగనాలు, అనుచరుల తోపులాటలు!
వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో ముందెన్నడూ లేని చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటూ ఆసక్తి రేపుతున్నాయి. ప్రధానంగా అధికార టీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారిన నేపథ్యంలో ఆ పార్టీలో వింతలు, విశేషాలు బోలెడన్ని చోటుచేసుకుంటున్నాయి. మొన్నటిదాకా టీడీపీ నేతగా కడియం శ్రీహరి, కాంగ్రెస్ నేతగా తాటికొండ రాజయ్య స్టేషన్ ఘనపూర్ లో తలపడ్డారు. ఒకరిపై మరొకరు విజయం సాధించారు. తదనంతరం ఇరువురూ గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో అప్పటిదాకా డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్యను పదవి నుంచి పీకేసిన కేసీఆర్, ఆ పదవిలో శ్రీహరిని నియమించారు. దీంతో అప్పటిదాకా వారి మధ్య ఉన్న విభేదాలకు మరింత ఆజ్యం పోసినట్లైంది. ఈ క్రమంలో శ్రీహరి రాజీనామా చేసిన వరంగల్ పార్లమెంటుకు జరగనున్న ఉప ఎన్నిక టికెట్ ను తమ కుటుంబసభ్యులకు ఇప్పించుకునేందుకు ఇరువురు నేతలు తీవ్ర స్థాయిలో యత్నించారు. అయితే వారి ఎత్తులు పారకపోగా, కేసీఆర్ సమక్షంలో విభేదాలను పక్కనబెట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఒకరినొకరు ఆలింగనం చేసుకోవాల్సి వచ్చింది. మొన్న హైదరాబాదులో పసునూరి దయాకర్ కు పార్టీ బీ ఫారం అందించే సందర్భంగా కేసీఆర్ సమక్షంలో ఇరువురు నేతలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అయితే వారి అనుచరులు మాత్రం అంతకు ఒకరోజు ముందు వారి సమక్షంలోనే వరంగల్ లో పరస్పరం తోసుకున్నారు. ఎన్నికలు ముగిసేలోగా ఇలాంటి వింతలు ఎన్ని వెలుగు చూస్తాయో చూడాలి.