: చోటా రాజన్ అప్పగింతకు ఇండోనేసియా సంసిద్ధత... ఇక తరలింపే తరువాయి!
మాఫియా డాన్ చోటా రాజన్ ను భారత్ కు అప్పగించేందుకు ఇండోనేసియా పోలీసులు దాదాపుగా ఒప్పుకున్నారు. ఇంటర్ పోల్ అందించిన సమాచారంతో జింబాబ్వే వెళుతున్న చోటా రాజన్ ను ఇండోనేసియా పోలీసులు బాలిలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తమ దేశంలో చోటా రాజన్ పై పలు కేసులు నమోదైనందున తమకు అప్పగించాలని భారత పోలీసులు ఇండోనేసియా పోలీసులను కోరారు. ఈ మేరకు నిన్న భారత పోలీసు అధికారుల బృందం బాలి చేరుకుని ఇండోనేసియా పోలీసులతో చర్చించారు. ఇరు దేశాల మధ్య నేరగాళ్ల అప్పగింతకు సంబంధించి అవగాహన ఒప్పందం ఉన్న నేపథ్యంలో భారత్ ప్రతిపాదనకు ఇండోనేసియా ఒప్పుకుంది. దీంతో చోటా రాజన్ ను నేడు భారత పోలీసులకు అప్పగించేందుకు ఇండోనేసియా పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన మరుక్షణమే చోటా రాజన్ ను భారత్ కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.