: ముంబై పోలీసుల్లో దావూద్ ఏజెంట్లు... చోటా రాజన్ సంచలన వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల సుదీర్ఘ వేట తర్వాత పోలీసులకు పట్టుబడ్డ మాఫియా డాన్ చోటా రాజన్ నిన్న సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం బాలి జైల్లో ఉన్న చోటా రాజన్ ను భారత్ కు తీసుకొచ్చేందుకు పోలీసు అధికారులు అక్కడికి వెళ్లారు. నిన్న అతడితో మాట్లాడారు. తనను వైద్య చికిత్సల కోసం తరలిస్తున్న క్రమంలో చోటా రాజన్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముంబై పోలీసులు తనను గతంలో తీవ్రంగా హింసించారని అతడు ఆరోపించాడు. అంతేకాక, ముంబై పోలీసుల్లో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఏజెంట్లు ఉన్నారని కూడా అతడు వ్యాఖ్యానించాడు. దీంతో తనకు ముంబై పోలీసులపై నమ్మకం లేదని పేర్కొన్నాడు. ఈ కారణంగా తనను ముంబై బదులు ఢిల్లీకి తరలించాలని పోలీసులను వేడుకున్నాడు. ఏదేమైనా దావూద్ అంటే తనకు భయమేమీ లేదని కూడా మరోమారు చోటా రాజన్ స్పష్టం చేశాడు.