: ఏపీలో కాపులకు బీసీ రిజర్వేషన్లు... విధివిధానాల కోసం బీసీ కమిషన్ కసరత్తు
ఏపీలో ఇఫ్పటిదాకా ఓసీలుగా కొనసాగుతున్న కాపు సామాజిక వర్గం ఇకపై బీసీగా మారనుంది. ఈ సామాజిక వర్గానికి కూడా బీసీ కోటాలో రిజర్వేషన్లను అమలు చేసేందుకు కసరత్తు మొదలైంది. ఈ మేరకు నిన్న విజయవాడలో సుదీర్ఘంగా కొనసాగిన భేటీలో ఏపీ కేబినెట్ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. అంతేకాక, కాపులకు బీసీ రిజర్వేషన్ల అమలు కోసం అవసరమైన విధివిధానాల రూపకల్పన బాధ్యతలను బీసీ కమిషన్ కు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గడచిన ఎన్నికల్లో భాగంగా కాపులను బీసీలుగా గుర్తిస్తామని, వారి అభ్యున్నతి కోసం కాపు కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి ఏటా రూ.వెయ్యి కోట్ల నిధులను కేటాయిస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు ఆయన ఇటీవలే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తాజాగా నిన్నటి కేబినెట్ భేటీలో ఈ అంశంపై ప్రధానంగా దృష్టి సారించిన చంద్రబాబు, ఆరునూరైనా కాపులకు బీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని తీర్మానించారు. అయితే ఇప్పటికే రాష్ట్రంలో వివిధ సామాజిక వర్గాలకు అమలవుతున్న రిజర్వేషన్లు 50 శాతం మేర ఉన్నాయి. కాపులకూ రిజర్వేషన్లంటే ఈ శాతం మరింత పెరగనుంది. అయితే మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న ఆంక్షలున్నందున, దీనిని అధిగమించేందుకు కేంద్రాన్ని సంప్రదించాలని కూడా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది.