: సోనియా అల్లుడిపై ఈడీ గురి... బినామీ కంపెనీలో సోదాలు, కీలక ఫైళ్లు స్వాధీనం
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురి పెట్టింది. వాద్రాకు బినామీ సంస్థగా ప్రచారం సాగుతున్న ఓ కంపెనీపై నిన్న ఢిల్లీలో ఈడీ దాడి చేసింది. దక్షిణ ఢిల్లీలోని సదరు కంపెనీలో గంటల తరబడి సోదాలు చేపట్టిన ఈడీ అధికారులు పలు కీలక ఫైళ్లతో పాటు కంప్యూటర్లను సీజ్ చేశారు. సోదాల తర్వాత నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో వాద్రా పేరును ఎక్కడా ప్రస్తావించని ఈడీ, పరోక్షంగా వాద్రా ఆధ్వర్యంలోని సంస్థలతో సదరు కంపెనీ నెరపిన లావాదేవీలను పేర్కొంది. సదరు కంపెనీపై మనీ లాండరింగ్ ఆరోపణల కింద కేసు నమోదు చేసింది. ఢిల్లీకి సరిహద్దుగా ఉన్న రాజస్థాన్ పట్టణంలో వాద్రా సంస్థలు భూములను కొనుగోలు చేసిన వైనంపై ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కొనుగోళ్లన్నీ నిన్న ఈడీ సోదాలు చేసిన కంపెనీ పేరిటే జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సదరు కంపెనీ వాద్రాకు బినామీగా వ్యవహరించిందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈడీ సోదాలపై కాంగ్రెస్ పార్టీ వేగంగా స్పందించింది. ఈడీ నమోదు చేసిన కేసులో వాద్రా పేరు గాని, ఆయన సంస్థల పేర్లు కాని లేవని కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధికార ప్రతినిధి అహ్మద్ షకీల్ తెలిపారు. అయినా ఈడీ సోదాలన్నీ రాజకీయ ప్రేరేపితంగానే జరుగుతున్నాయని కూడా అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.