: వాటర్ ప్రాజెక్ట్ పైప్ లైన్లతో పాటే ఇంటింటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలి: మంత్రి కేటీఆర్ ఆదేశాలు
వందశాతం ఇంటర్నెట్ కనెక్షన్లు ఉన్న రాష్ట్రంగా తెలంగాణను మారుస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. జలహారం, ఇంటింటికీ ఇంటర్నెట్ పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఐటీ, ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, వాటర్ ప్రాజెక్ట్ పైప్ లైన్లతో పాటే ఇంటింటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం సూచించిన ప్రమాణాల మేరకు ఫైబర్ కేబుల్ పనులు చేయాలని ఆదేశించారు. వాటర్ ప్రాజెక్టు పైప్ లైన్లతో పాటే ఆప్టిక్ ఫైబర్ వేయడం ద్వారా ఎనభై శాతం ఖర్చు తగ్గుతుందని, త్వరలోనే సమగ్ర విధివిధానాలను రూపొందిస్తామని ఆయన తెలిపారు. వాటర్ ప్రాజెక్టు పైప్ లైన్ల తవ్వకాలు ప్రారంభమవుతున్నందున ఈ నెల 9వ తేదీ లోగా ఇంటర్నెట్ మార్గదర్శకాలు, ఇతర ప్రమాణాలను తయారు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.