: జల్లికట్టు చిత్రాలతో ప్రజలకు అవగాహన కలుగుతుంది: కమల్ హాసన్
చెన్నైలోని లలిత కళా అకాడమీలో జల్లికట్టుకి సంబంధించిన చిత్రాల ప్రదర్శనను ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ ప్రారంభించారు. ఈ తరహా చిత్రాలతో ప్రదర్శనను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఈ ప్రదర్శనలో చిత్రాలను ఆయన ఆసక్తిగా చూశారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ, ఇటువంటి చిత్రాల ద్వారా జల్లికట్టు గురించి ప్రజలకు మరింత అవగాహన పెరుగుతుందన్నారు. ఈ చిత్రాల ప్రదర్శన ఈ నెల 8వ తేదీ వరకు కొనసాగుతుందని నిర్వాహకులు చెప్పారు. కాగా, వీర విలయాట్టుగా పిలువబడే జల్లికట్టు క్రీడ తమిళనాడు గ్రామీణ సంస్కృతిలో భాగం. తమిళుల సంప్రదాయ, సాహస క్రీడగా దీనికి పేరు. సంక్రాంతి పర్వదినాల్లో దక్షిణాది జిల్లాల్లో కోలాహలంగా జల్లికట్టును నిర్వహించడం ఆనవాయతి. జల్లికట్టు అనగానే మధురై జిల్లా అలంగానల్లూరు గుర్తుకు వస్తుంది. ఎందుకంటే, అక్కడ జరిగే జల్లికట్టు ఎంతో ప్రజాదరణ పొందింది.