: టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా దేవయ్య పేరు ఖరారు
వరంగల్ లోక్ సభ ఉపఎన్నికకు సంబంధించి టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఎంపికపై కసరత్తు పూర్తయింది. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పగిడిపాటి దేవయ్య పేరును ఖరారు చేస్తూ బీజేపీ నేతలు అధిష్ఠానానికి సమాచారం పంపారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు హైదరాబాద్ లో సమావేశమయ్యారు. అయితే, దేవయ్య పేరును అధికారికంగా అధిష్ఠానం రేపు ప్రకటించనుంది. దేవయ్య గురించి చెప్పాలంటే... వరంగల్ జిల్లాలోని కిలాసాపురం ఆయన స్వస్థలం. నిజాం కాలేజి, ఉస్మానియా వైద్య కళాశాలలో ఆయన వైద్య విద్యను అభ్యసించారు. కాకతీయ మెడికల్ కళాశాలలో అనాటమీ ప్రొఫెసర్ గా ఆయన విధులు నిర్వహించారు. 1973లో వివాహానంతరం అమెరికాలో దేవయ్య స్థిరపడ్డారు. 42 ఏళ్ల పాటు అమెరికాలో ఉన్నప్పటికీ అక్కడి పౌరసత్వాన్ని మాత్రం ఆయన తీసుకోలేదు. అమెరికాలో వివిధ కార్పొరేట్ ఆస్పుత్రుల్లో వైద్య సేవలందించారు. వెనుకబడ్డ దళితుల కోసం 2009లో ఆయన ‘నాదం’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు.