: ఈ ఏడాది సౌదీలో 142 మందికి మరణశిక్ష అమలు
వివిధ హత్య కేసులకు సంబంధించి ఈ ఏడాది 142 మంది దోషులకు తమ దేశంలో మరణశిక్ష విధించినట్లు సౌదీ అరేబియా ప్రభుత్వం పేర్కొంది. సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఒక హత్య కేసులో అరెస్టయిన వ్యక్తి దోషి అని తేలడంతో అతనికి తాజాగా మరణశిక్ష విధించారు. దీంతో ఈ ఏడాది మరణశిక్ష పడిన వారి సంఖ్య 142కు చేరిందని ఆ ప్రకటనలో పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరణశిక్షకు గురైన వారి సంఖ్య పెరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ దేశ నియమ నిబంధనల ప్రకారం దోషి తలను కత్తితో నరికివేయడం ద్వారా మరణశిక్షను అమలు చేస్తారు. అత్యాచారాలకు పాల్పడటం, ఇస్లామిక్ న్యాయ పరిధులను అతిక్రమించడం, మతాన్ని కించపరిచే పనులకు పాల్పడటం, డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడటం, ఆయుధాల దోపిడీకి పాల్పడిన వారికి ఈ దేశంలో మరణశిక్ష విధిస్తారు. కాగా, దోషులకు మరణశిక్ష అమలు చేసే విషయంలో సౌదీ అరేబియా ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల్లో చైనా, ఇరాన్ దేశాలు ఉన్నాయి.