: ప్రతిపక్షాలు ఏదో ఒక విధంగా రాద్ధాంతం చేస్తున్నాయి: ఎంపీ వినోద్
ఇటీవల సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలవడంపై తెలంగాణ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఎంపీ వినోద్ ఖండించారు. విభజన చట్టంలోని అంశాల పరిష్కారానికి కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశామని, ఆయన్ను కలవడాన్ని కూడా ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. కేంద్ర పెద్దలను కలిస్తే ఒకలా... కలవకుంటే మరోలా మొత్తంమీద అసత్య ఆరోపణలతో ఏదోవిధంగా రచ్చ చేస్తున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వినోద్ మాట్లాడారు. వరంగల్ లోక్ సభకు టీఆర్ఎస్ అభ్యర్ధి పసునూరి దయాకర్ ను వరంగల్ వాసులు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్టీ ఆవిర్భావం నుంచి దయాకర్ పని చేస్తున్నారని, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని చెప్పారు.