: 'బిగ్ బాస్ 9'లో తన బాధ చెప్పుకుని వాపోయిన సల్మాన్
కలర్స్ ఛానెల్ లో ప్రసారమవుతున్న 'బిగ్ బాస్ సీజన్ 9'లో ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మనసులో గూడుకట్టుకున్న ఆవేదనను వెళ్లగక్కాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చేసిన తప్పొప్పులపై వారాంతంలో విశ్లేషణ చేసే సల్లూభాయ్, అందులో పార్టిసిపెంట్స్ ప్రదర్శనతో తృప్తి చెందలేదు. దీంతో ప్రేక్షకులను సంతోష పెట్టాలని వారికి సూచించాడు. ఈ సందర్భంగా సల్లూ మాట్లాడుతూ, 'మనకి చాలా ఇబ్బందులుంటాయి. కానీ అవన్నీ పక్కన పెట్టాలి. ప్రేక్షకులను సంతోషపెట్టడమే అంతిమ లక్ష్యంగా పని చేయాలి' అని చెప్పాడు. "నాకు కూడా చాలా ఇబ్బందులున్నాయి. కోర్టు కేసులు ఉన్నాయి. మరోపక్క షూటింగుల్లో పాల్గొనాలి. దేశాలు తిరగాలి, సామాజిక కార్యక్రమాలు చేయాలి. నాపై ఉన్న కేసుల్లో ఎన్నేళ్లు శిక్షపడుతుందో అన్న ఆందోళన, వెరసి ఎన్ని బాధలున్నా నవ్వుతూ 'బిగ్ బాస్ 9' షో చేయాలి. నేను చేయడం లేదా?" అంటూ కంటెస్టెంట్స్ ను ప్రశ్నించాడు. అలాగే ఎన్ని ఆలోచనలు ఉన్నా, ఇగోలను పక్కన పెట్టి అభిమానులను ఎంటర్ టైన్ చేయాలని సల్లూ సూచించాడు.