: భారత్ కు దూరమవుతున్న నేపాల్!
మన పొరుగుదేశమైన నేపాల్ కు పెట్రో ఉత్పత్తులను అందిస్తున్న దేశం భారత్. ఆ దేశం చుక్క పెట్రోల్ వినియోగించాలన్నా మనదేశం నుంచి ఎగుమతి అవ్వాల్సిందే. కానీ, నేపాల్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కొత్త నిర్ణయాలు తీసుకుంది. చైనా నుంచి తమకు కావాల్సిన పెట్రో ఉత్పత్తులను దిగుమతి చేేసుకోవాలని నిర్ణయించుకుంది. దీని ప్రభావం భారత్-నేపాల్ ల మధ్య ఉన్న‘పెట్రో’ వ్యాపార సంబంధాలపై పడనుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) ఆదాయంపై కూడా దీని ప్రభావం తీవ్రంగానే ఉండే అవకాశం ఉంది. కాగా, నాలుగు దశాబ్దాలుగా నేపాల్ కు భారత్ ‘పెట్రో’ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. భారత్ నుంచి నేపాల్ కు పైపులైన్ ద్వారా పెట్రో ఉత్పత్తులను సరఫరా చేసేందుకు మన ప్రభుత్వం భారీ ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే 41 కిలోమీటర్ల పొడవైన రాక్స్వల్-అమ్లేఖ్ గంజ్ పైపులైన్ ఏర్పాటుకు చమురు సరఫరాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. దక్షిణాసియాలో రెండు దేశాల మధ్య ఏర్పాటు చేయనున్న మొట్టమొదటి పైపులైన్ వ్యవస్థ కూడా ఇదే కావడం గమనార్హం. నేపాల్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో భారత్ కు వచ్చే ఆయిల్ ఆర్డర్ల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ‘ఇటువంటి పరిస్థితి రావడం చాలా దారుణం. పైపులైన్లకు సంబంధించి సాంకేతిక-ఆర్థిక వెసులబాటు విషయమై దృష్టి సారించే అవకాశం ఉంది’ అని పేరు చెప్పడానికి నిరాకరించిన ఐఓసీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు అభిప్రాయపడ్డారు. అయితే, నేపాల్ తీసుకున్న తాజా నిర్ణయం కారణంగా, ఆ దేశం నుంచి ఇప్పటికే కాంట్రాక్టు కుదుర్చుకున్న ట్యాంకర్ల యజమానులు తమ వాహనాలను అక్కడికి చేర్చేందుకు చాలా ఆతృతగా ఉన్నారు.