: నా అవార్డులూ ఇచ్చేస్తా... పుట్టిన రోజు వేడుకల వేళ షారూఖ్ సంచలన వ్యాఖ్య
నేడు తన 50వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో జరుగుతున్న మతపరమైన ఘటనలు ఎంతో మందిలో అసహనాన్ని పెంచుతున్నాయని, తనకు లభించిన అవార్డులను వెనక్కిచ్చేందుకు వెనుకాడబోనని ఆయన వ్యాఖ్యానించారు. ఇండియాటుడే ప్రతినిధి రాజ్ దీప్ సర్దేశాయ్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ, "అవును. నేనూ అవార్డులు ఇచ్చేస్తా... చాలా మందిలో అసహనం పెరుగుతోంది. అదీ చాలా ఎక్కువగా" అని అన్నారు. తాను సెలబ్రిటీ కాని తొలినాళ్లలో ఓ ముస్లింగా ఎదుర్కొన్న ఘటనలను, సెలబ్రిటీగా మారిన తరువాత విదేశాల్లో తనకు ఎదురైన అనుభవాలను షారూఖ్ గుర్తు చేసుకున్నారు. కాగా, ఇప్పటికే హర్షవర్థన్ కులకర్ణి, నిషాత్ జైన్, దివాకర్ బెనర్జీ, ఆనంద్ పట్వర్థన్ వంటి బాలీవుడ్ ప్రముఖులు తమతమ అవార్డులను తిరిగి ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అనుపమ్ ఖేర్, మధుర్ బండార్కర్ వంటి వారు దీన్ని వ్యతిరేకిస్తున్నారు.