: బస్కీలు తీసిన కిరణ్ రిజిజు...‘మైండ్ రాక్స్’ ఈవెంట్ లో కేంద్రమంత్రి కుస్తీ ఫీట్!
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు ఏ కోణంలో చూసినా రాజకీయ నేతగా కనిపించరు. టెక్కీ లుక్ తో ఇట్టే ఆకట్టుకునే ఆయన ఏ ఐఏఎస్ గానో, ఐపీఎస్ గానో కనిపిస్తారు. చక్కటి వస్త్రధారణను అలా పక్కనబెడితే, శరీరాకృతిలో రిజిజు అచ్చమైన పోలీస్ అధికారిగానే కనిపిస్తారు. ఇక పనితీరులో ఆయన కఠోర శ్రామికుడే. కార్యరంగంలో వీరుడిగా పేరున్న ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రిజిజు పనితీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు మరి. అసలు ఈ పొగడ్తలన్నీ ఎందుకంటే, కేంద్ర మంత్రి హోదాలో ఉన్నా, శారీరక వ్యాయామం పట్ల యువత ఆసక్తి పెంచుకోవాలని చెప్పే క్రమంలో రిజిజు ఏకంగా బస్కీలు తీశారు. ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే ‘మైండ్ రాక్స్’ పేరిట నిర్వహించిన ఓ కార్యక్రమంలో రిజిజు బస్కీలు తీసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. రిజిజు ఉత్సాహాన్ని చూసి ఇండియా టుడే ఎడిటర్ (స్ట్రాటజిక్ అఫైర్స్) గౌరవ్ సావంత్ కూడా బస్కీలు తీసేందుకు ఉద్యుక్తులయ్యారు. బ్లాక్ ప్యాంట్ లో వైట్ షర్ట్ ను చక్కగా ఇన్ షర్ట్ చేసుకుని కార్యక్రమానికి వచ్చిన రిజిజు, గౌరవ్ సావంత్ తో కలిసి బస్కీలకు సిద్ధమయ్యారు. ఇద్దరూ వేదిక ఉపరితలంపై చేతులు ఆనించి బస్కీలు తీయడం మొదలుపెట్టారు. కొంతసేపటికి సావంత్ రొప్పుతూ కాసేపు ఆగిపోయారు. రిజిజు మాత్రం తన బస్కీల ఫీట్ ను మాత్రం ఆపలేదు. ఆ తర్వాత సావంత్ సంజ్ఞలను గమనించిన రిజిజు తన విన్యాసాన్ని ఆపేశారు. కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు రిజిజు విన్యాసాన్ని మంత్రముగ్ధులై అలా చూస్తుండిపోయారు. ఫిట్ తర్వాత చప్పట్లతో రిజిజుకు సెల్యూట్ చేశారు.