: రూపాయి ఖర్చు పెట్టకుండా 'ఎంటీఎస్'ను విలీనం చేసుకోనున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్
అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ 'ఎంటీఎస్' బ్రాండ్ పేరిట సెల్యులార్ సేవలను అందిస్తున్న సిస్టెమా శ్యామ్ టెలీ సర్వీసెస్ (ఎస్ఎస్టీఎల్)ను విలీనం చేసుకోనుంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 4,500 కోట్ల నుంచి రూ. 5 వేల కోట్ల మధ్య ఉంటుందని అంచనా. అయితే, ఈ డీల్ పూర్తి నగదు రహితమని, వాటాలను పంచడం ద్వారా విలీనం పూర్తికానుందని ఆర్ కాం అధికారి ఒకరు తెలిపారు. ఇరు కంపెనీల విలీనం తరువాత ఏర్పడే సంస్థలో 10 శాతం వాటాను ఎస్ఎస్టీఎల్ అనుభవిస్తుందని తెలిపారు. ఇకపై దేశంలో నాలుగవ అతిపెద్ద టెలికం సంస్థగా ఆర్ కాం నిలుస్తుందని, 4జీ సేవలను అందించే 850 మెగాహెర్జ్ ఫ్రీక్వెన్సీ సైతం చాలినంత ఉంటుందని వివరించారు. కాగా, ఇండియాలో 22 టెలికం సర్కిళ్లుండగా, తొమ్మిదింటిలో సేవలందిస్తున్న ఎంటీఎస్ ను 90 లక్షల మంది యూజర్లు వినియోగిస్తున్నారు. గత శుక్రవారం నాటి స్టాక్ మార్కెట్ సెషన్లో ఆర్ కాం ఈక్విటీ ముగింపు రూ. 75.25 కాగా, దీని ప్రకారం సంస్థ విలువ ఆర్ కాం విలువ రూ. 19 వేల కోట్లుగా ఉంది. వాస్తవానికి ఈ విలువతో పోలిస్తే, 10 శాతం వాటా ఇచ్చే బదులు కింద రూ. 1,900 కోట్లను చెల్లిస్తే సరిపోతుంది. కానీ, ఈ రంగంలోని అవకాశాలు, గతంలో ఆర్ కాం విలువను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం, ఎంటీఎస్ కు ఇస్తున్నది తక్కువేనని భావించాలి.