: చైన్ స్నాచర్లపై పోలీసుల కాల్పులు... చాకచక్యంగా తప్పించుకున్న గొలుసు దొంగలు
హైదరాబాదు శివారు ప్రాంతం వనస్థలిపురంలో నేటి ఉదయం చోటుచేసుకున్న కాల్పుల ఘటన కలకలం రేపింది. పొద్దున్నే రోడ్డుపైకి వచ్చేసిన చైన్ స్నాచర్లు అటుగా వెళుతున్న ఓ మహిళ మెడలోని గొలుసును లాగేందుకు యత్నించారు. అయితే అదే సమయంలో అటుగా వచ్చిన యాంటీ చైన్ స్నాచింగ్ టీం పోలీసులు గొలుసు దొంగల వెంటబడ్డారు. పోలీసుల రాకను గమనించిన స్నాచర్లు తమ బ్లాక్ పల్సర్ బైక్ వేగం పెంచారు. ఆటో నగర్ సమీపంలోని రాజధాని హోటల్ వద్ద చైన్ స్నాచర్లను సమీపించిన పోలీసులు వారిపైకి కాల్పులు జరిపారు. అయితే పోలీసుల బుల్లెట్ల నుంచి చాకచక్యంంగా తప్పించుకున్న స్నాచర్లు యూటర్న్ తీసుకుని పరారయ్యారు. ఆ తర్వాత సిటీ వైపు వేగంగా దూసుకువచ్చిన దొంగలు ఎల్బీ నగర్ వద్ద అదృశ్యమయ్యారు. యాంటీ చైన్ స్నాచింగ్ టీం అప్రమత్తం చేయడంతో స్థానిక పోలీసులు ఎల్బీ నగర్ ను జల్లెడ పతుతున్నారు. దీంతో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.