: చుట్ట తాగిన ఫొటోలు పెట్టిన 'సమంత'కు పొగాకు ప్యాకెట్లు పంపుతారట
ముందు బేషరతుగా క్షమాపణ చెప్పు... లేకపోతే నీ ఇంటిని చుట్టుముడతాం... ఇది నటి సమంతకు హిందు మక్కల్ కచ్చి పార్టీ ఇచ్చిన వార్నింగ్. వివరాల్లోకి వెళ్తే, '10 ఎండ్రదుకుళ్' సినిమాలో విక్రమ్ సరసన నటించిన సమంత ఆ సినిమాపై భారీ ఆశలే పెట్టుకుంది. సినిమాకు ప్రచారం కల్పించేందుకు తనకు తానుగా కూడా ప్రయత్నించింది. అయినా, బాక్సాఫీస్ వద్ద సినిమా బోల్తా కొట్టింది. ఈ బాధలో ఉన్న సమంతకు కొత్త సమస్య వచ్చి పడింది. సినిమాలో తాను చుట్ట తాగే ఫొటోలను ఇటీవల ట్విట్టర్ లో పోస్ట్ చేసింది సమంత. దీనిపై హిందు మక్కల్ కచ్చి పార్టీ మండిపడింది. పొగతాగడం వల్ల మహిళలు కేన్సర్ కు గురవుతున్నారని... పొగతాగడం హానికరమని ప్రభుత్వం కూడా ప్రచారం చేస్తోందని... కానీ, సమంతలాంటి వాళ్లు మాత్రం పొగతాగే విధంగా ఉసిగొల్పుతున్నారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరమాణిక్యం ఓ ప్రకటన విడుదల చేశారు. చుట్ట తాగే ఫొటోను ట్విట్టర్లో పెట్టినందుకు... సమంత వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆమె ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా, ఆమెకు పొగాకు ప్యాకెట్లను పోస్టు ద్వారా పంపిస్తామని చెప్పారు.