: 'మీ ఇంటికి మీ భూమి' నుంచి భలేగా తప్పించుకున్న ఏపీ రెవెన్యూ!


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న 'మీ ఇంటికి మీ భూమి' కార్యక్రమాన్ని స్వయంగా రెవెన్యూ అధికారులే అపహాస్యం చేస్తున్న పరిస్థితి. భూముల సర్వే, మ్యుటేషన్ తదితర సమస్యల గురించి అధికారుల దృష్టికి లక్షలాది దరఖాస్తులు రాగా, సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు, 'బంతి పక్క కోర్టుకు' అనే విధానాన్ని పాటిస్తూ, తమ పని అయిపోయిందన్న లెక్కకు వచ్చారు. వచ్చిన దరఖాస్తులపై 'మీ-సేవ కేంద్రానికి వెళ్లి డబ్బులు కట్టి దరఖాస్తు ఇవ్వండి' అని రాసి చేతులు దులుపుకున్నారు. కాగా, గత ఆగస్టులో తొలి విడత 'మీ ఇంటికి మీ భూమి' చేపట్టగా, వచ్చిన 59 వేల దరఖాస్తులపై మీ-సేవ కేంద్రాలకు వెళ్లాలని రెవెన్యూ సిబ్బంది సలహా ఇచ్చారు. ఇక సర్వే అంశాలపై వచ్చిన 1.54 లక్షల దరఖాస్తులు సైతం అపరిష్కృతంగానే ఉన్నాయి. వీటికి అదనంగా మ్యుటేషన్ దరఖాస్తులు మరో 35 వేల వరకూ ఉన్నాయని తెలుస్తోంది. వీటన్నింటినీ మీ-సేవకే పంపారు. తొలి విడతలోనే 'మీ ఇంటికి మీ భూమి' అభాసుపాలు కాగా, నిన్న రెండో విడతను చంద్రబాబు ప్రారంభించారు. ఈ దఫా అధికారులు ఏం చేస్తారో? అయినా తొలి విడతలో పాటించిన మార్గం ఎలాగూ ఉందిగా!

  • Loading...

More Telugu News