: సాయిబాబాను తరిమికొడుతున్న హనుమాన్... వివాదాస్పద చిత్రం విడుదల చేసిన శంకరాచార్య
వచ్చే మూడేళ్లలో దేశంలోని అన్ని షిరిడీ సాయిబాబా ఆలయాలనూ కూలగొట్టి హనుమంతుడి దేవాలయాలు నిర్మిస్తామని సనాతన ధర్మాలు బోధించే శంకరాచార్య స్వామీజీ స్వరూపానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కలలో ఆంజనేయుడు వచ్చి సాయిని తరిమికొడుతున్నట్టు కనిపించిందని చెబుతూ, ఓ చిత్రాన్ని విడుదల చేశారు. భోపాల్ లో ఈ మేరకు ఓ పోస్టర్ ను ఆయన విడుదల చేయగా వివాదం రాజుకుంది. సాయిబాబా పరిగెడుతుంటే, ఓ చెట్టును పెకిలించిన హనుమంతుడు ఆయన్ను కొట్టడానికి ఉరికొస్తున్నట్టు ఈ చిత్రం ఉంది. సాయి అసలు దేవుడే కాదని, ఈ సందర్భంగా స్వరూపానంద వ్యాఖ్యానించారు. ఈ పోస్టరును దేశమంతా పంచాలని ఆయన తన శిష్యులను ఆదేశించారు. సాయిబాబా అసలు పేరు చాంద్ మియా అని, ఆయన చనిపోయి చాలా రోజులైందని, ఆయన్ను దేవుడిలా కాకుండా, దెయ్యంలా చూస్తున్నామని వ్యాఖ్యానించారు. సాయి భక్తులు పెరగడం ఆందోళన కలిగిస్తోందని, దీని వెనుక సనాతన హిందూ దేవుళ్లను మాయం చేసే కుట్ర దాగుందని ఆయన ఆరోపించారు. కాగా, స్వరూపానంద సరస్వతి వ్యాఖ్యలను ఆర్ఎస్ఎస్ ఖండించింది. సాయి ఎన్నడూ తాను దేవుడినని చెప్పుకోలేదని ఆర్ఎస్ఎస్ నేత మన్మోహన్ వైద్య వ్యాఖ్యానించారు. సంఘ్ లో సైతం ఎంతో మంది సాయి భక్తులున్నారని, ఆయన వ్యాఖ్యలతో ఆర్ఎస్ఎస్ కు సాయి భక్తులు దూరమవుతారన్న ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు దీనిపై సాయి భక్తులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆర్ఎస్ఎస్ స్పందన తెలుసుకున్న స్వరూపానంద మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించలేకపోయిన ఆర్ఎస్ఎస్ ఇప్పుడెందుకు మాట్లాడుతోందని ప్రశ్నించారు. సాయి ట్రస్ట్ పేరిట షిరిడీలో జరుగుతున్న గోల్ మాల్ పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.