: రాహుల్ గాంధీ, అమిత్ షాలకు ఈసీ నోటీసులు... లాలూకు కూడా!
బీహార్ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ పూర్తి కాగా, చివరి దశ ఐదో విడత పోలింగ్ కోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో నిన్న అటు నాలుగో విడత పోలింగ్ జరుగుతుండగానే కేంద్ర ఎన్నికల సంఘం కీలక అడుగేసింది. ఎన్నికల నియమావళిని అతిక్రమించారంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీహార్ మాజీ సీఎం, ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ లకు నోటీసులు జారీ చేసింది. ‘పాకిస్థాన్ లో మతాబులు పేలతాయి’ వ్యాఖ్యలపై అమిత్ షాకు నోటీసులు జారీ కాగా, ‘హిందూ, ముస్లింల మధ్య బీజేపీ గొడవలు పెడుతోంది’’ అన్న కామెంట్లపై రాహుల్ కు ఈసీ శ్రీముఖం పంపింది. ఇక మోదీని ‘వాంపైర్’ (రక్తపిపాసి)గా అభివర్ణించిన లాలూకు కూడా ఈసీ నోటీసులు జారీ చేసింది. ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రసంగం చేసిన బీహార్ అధికార పార్టీ జేడీయూ అధినేత శరద్ యాదవ్ ను కూడా ఈసీ వదల్లేదు. వివాదాస్పద వ్యాఖ్యలకు నిర్ణీత గడువులోగా వివరణ ఇవ్వాలని సదరు నోటీసుల్లో నేతలకు ఆదేశాలు జారీ చేసింది.