: బాలి పోలీసుల చేతిలో చోటా రాజన్ ల్యాప్ టాప్, సెల్ ఫోన్... వెలుగులోకి రానున్న కీలక సమాచారం
మాఫియా డాన్ చోటా రాజన్ కార్యకలాపాలకు సంబంధించిన కీలక సమాచారం ఇక బాలి పోలీసులకు చిక్కినట్టే. ఎందుకంటే, చోటా రాజన్ కు చెందిన ల్యాప్ టాప్, సెల్ ఫోన్లను బాలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సదరు ల్యాప్ టాప్, సెల్ ఫోన్లలోని సమాచారం మొత్తాన్ని వెలికితీసే పనిలో బాలి పోలీసులు నిమగ్నమయ్యారు. ఆస్ట్రేలియా నగరం సిడ్నీ నుంచి జింబాబ్వేకు వెళుతున్న క్రమంలో బాలి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండోనేసియా పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడి జైల్లో ఉన్న చోటా రాజన్ ను పలుమార్లు ప్రశ్నించిన బాలి పోలీసులు అతడి నుంచి పలు కీలక అంశాలకు చెందిన సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. తాజాగా అతడి ల్యాప్ టాప్, సెల్ ఫోన్ కూడా బాలి పోలీసుల చేతికి చిక్కడంతో రాజన్ కార్యకలాపాలకు సంబంధించిన మొత్తం సమాచారం వెల్లడయ్యే అవకాశాలున్నాయి.