: హరీశ్ రావు అలక... ‘తూర్పు’ సమావేశానికి డుమ్మా!
వరంగల్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల పరిస్థితులే స్వాగతం చెబుతున్నట్టున్నాయి. ‘గెలుపు సారథి’గా పేరుపడ్డ టీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పార్టీ అభ్యర్థి ఎంపికపై అసంతృప్తి రాగం వినిపిస్తున్నట్లు సమాచారం. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలను విభజించిన పార్టీ అధినేత కేసీఆర్, ఏడింటికి ఏడుగురు మంత్రులను ఇంచార్జీలుగా నియమించారు. వీటిలో వరంగల్ తూర్పు నియోజకవర్గ బాధ్యతలను హరీశ్ రావుకు అప్పగించారు. నిన్న ఏడు నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఆయా నియోజకవర్గాలకు ఇంచార్జీలుగా నియమితులైన మంత్రుల్లో ఆరుగురు మంత్రులు సమావేశాలు నిర్వహించారు. అయితే వరంగల్ తూర్పు నియోజకవర్గ సమీక్ష మాత్రం ఈ నెల 4కు వాయిదా పడింది. కారణమేంటంటే, హరీశ్ రావు ఈ సమావేశానికి హాజరు కాలేదు. నిన్న తన సొంత నియోజకవర్గం సిద్దిపేటలోనే ఉన్న హరీశ్, నేడు హైదరాబాదులో ఉంటారట. రేపు ఆయన ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఆయన ‘తూర్పు’ సమీక్షకు వెళతారట. వరంగల్ లోక్ సభ అభ్యర్థిగా పార్టీ యువనేత, ఉద్యమంలో ముందుండి పోరాడిన ఎర్రోళ్ల శ్రీనివాస్ అభ్యర్థిత్వం కోసం హరీశ్ పట్టుబట్టారట. అయితే కేసీఆర్ కుమారుడు కేటీఆర్ చక్రం తిప్పి తాను అనుకున్న అభ్యర్థి పసునూరి దయాకర్ కు టికెట్ ఇప్పించుకున్నారు. ఈ ఎంపికపై కినుక వహించిన హరీశ్ నిన్నటి సమావేశానికి హాజరుకాలేదన్న ప్రచారం సాగుతోంది.