: ఉగ్రవాదంపై రాజీలేని పోరు సాగించా...ఇకపైనా కొనసాగిస్తా: చోటా రాజన్ ఆసక్తికర కామెంట్స్


రెండు దశాబ్దాలకు పైగా భారత పోలీసులకు మూడు చెరువుల నీరు తాగించిన మాఫియా డాన్ చోటా రాజన్ ఎట్టకేలకు ఇండోనేసియా నగరం బాలిలో పట్టుబడ్డాడు. ప్రస్తుతం బాలి జైలులో విశ్రాంతి తీసుకుంటున్న అతడిని దేశానికి రప్పించేందుకు భారత్ పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో చోటా రాజన్ ‘ఏబీపీ న్యూస్’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఉగ్రవాదంపై రాజీలేని పోరు సాగించానని అతడు వ్యాఖ్యానించాడు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో పోరుతోనే తన జీవితం గడిచిపోయిందని కూడా అతడు చెప్పుకొచ్చాడు. ఉగ్రవాదంపై తాను చేసిన పోరాటాన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తానని కూడా రాజన్ పేర్కొన్నాడు. తొలుత దావూద్ ఇబ్రహీంతో కలిసి పనిచేసిన చోటా రాజన్, ముంబై పేలుళ్ల ఘటనను విభేదించి దావూద్ కు దూరంగా జరిగిన విషయం తెలిసిందే. నాటి నుంచి దావూద్, చోటా రాజన్ గ్యాంగ్ ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూనే ఉంది. దావూద్ కుడి భుజం చోటా షకీల్ పలుమార్లు చోటా రాజన్ ను మట్టుబెట్టేందుకు యత్నించాడు. అయితే దాడి జరిగిన ప్రతిసారి చోటా రాజన్ చాకచక్యంగా తప్పించుకున్నాడు. దావూద్ పై భవిష్యత్తులోనూ పోరు సాగిస్తానని చోటా రాజన్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది.

  • Loading...

More Telugu News