: విశాఖలో వర్ష బీభత్సం... హైదరాబాదులో మంచు తెరలు!
తెలుగు నేలపై భిన్న వాతావరణ పరిస్థితులు ఆసక్తి గొలుపుతున్నాయి. మొన్నటిదాకా హైదరాబాదు, విశాఖపట్నం... రెండూ ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన నగరాలుగానే ఉన్నాయి. తాజాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాదు తెలంగాణకు రాజధానిగా అవతరించగా, విశాఖ అవశేష ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధానిగా కొత్త హోదా సంపాదించింది. తెలుగు నేలపై ఉన్న ఈ రెండు నగరాల్లో ప్రస్తుతం భిన్న వాతావరణ పరిస్థితులు ఆవిష్కృతమయ్యాయి. అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా ఏపీలోని ఉత్తరాంధ్రపై వరుణుడు ప్రతాపం చూపాడు. విశాఖ సహా నాలుగు జిల్లాలలో భారీ వర్షమే కురిసింది. విశాఖలో కురిసిన వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఇక హైదరాబాదులో చలిపులి పంజా విసురుతోంది. ఆదివారం తెల్లవారుజామున నగరాన్ని తొలి మంచు తెరలు కప్పేశాయి. విశాఖలో వర్ష బీభత్సం, హైదరాబాదులోని మంచు తెరలకు సంబంధించిన ఫొటోలతో ఓ తెలుగు దినపత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.