: బెయిల్ రాగానే ఆ నేతాశ్రీ ఆరోగ్యం బాగుపడింది!


పశ్చిమ బెంగాల్ శారద కుంభకోణం కేసులో నిందితుడు ఆ రాష్ట్ర మాజీ మంత్రి మదన్ మిత్ర, తనకు ఆరోగ్యం బాగాలేదంటూ కొన్ని నెలలుగా ఆసుపత్రిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో, ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. బెయిల్ మంజూరైన మర్నాడే ఆయన ఆసుపత్రిని వదిలేసి ప్రత్యేక అంబులెన్స్లో తన నివాసానికి వెళ్లడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తనకు అనారోగ్యంగా ఉన్నట్లు నమ్మించారంటూ పలువురు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ సంఘటనపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వైద్యులు, ప్రభుత్వం కుమ్మక్కై ఇన్ని రోజులు ఈ తతంగం నడిపారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆయనకు ఆస్పత్రిలో సకల భోగాలు ఏర్పాటు చేశారని కూడా ఇటీవల విమర్శలు భారీ స్థాయిలో వచ్చాయి. కాగా, మిత్రా విడుదల సందర్భంగా ఆయన మద్దతు దారులు ఆయన నివాసం వద్ద పటాసులతో నానా హంగామా చేశారు. ఈ సందర్భంగా మీడియాను మిత్రాను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఇప్పుడు మాట్లాడటానికి ఇది సమయం కాదంటూ ఆయన ఇంట్లోకి వెళ్లిపోయారు. కాగా, శారదా కుంభకోణం కేసుకు సంబంధించి గత ఏడాది డిసెంబర్ 12న మిత్రాను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అయితే సీబీఐ కస్టడీలో ఉండగానే అనారోగ్యంగా ఉందంటూ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. వీవీఐపీలకు ప్రత్యేక చికిత్సనందించే విభాగంలో ఆయన గడిపారు. డిసెంబర్ 19న ఆయనను సీబీఐ కస్టడీకి తీసుకోగా ఇప్పటి వరకు కేవలం 50 రోజులు మాత్రమే జైలులో గడిపిన ఆయన మిగిలిన రోజులన్నీ ఆస్పత్రిలోనే ఉన్నారు. బెయిల్ పిటిషన్లు పెట్టుకుంటూ వచ్చారు. ఎప్పటికప్పుడు బెయిల్ పిటిషన్లను కోర్టు తిరరస్కరించడం జరిగింది.

  • Loading...

More Telugu News