: సొంత రాష్ట్రాన్ని పట్టించుకోని వ్యక్తా, నెహ్రూపై అభాండాలు వేసేది!: అసోం సీఎం
తన సొంత రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ గురించి ఏమాత్రం పట్టించుకోని కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గురించి మాట్లాడే అర్హత లేదని అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ అన్నారు. 1962నాటి ఇండియా చైనా యుద్ధ సమయంలో నెహ్రూ ఈశాన్య ప్రాంత ప్రజలను గాలికొదిలేశారని ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై గొగోయ్ స్పందించారు. నెహ్రూపై కేంద్రమంత్రి తప్పుడు ప్రచారం, అభాండాలు మోపడం మానుకుంటే మంచిదని ఆయన హితవు పలికారు. తన సొంత రాష్ట్రాన్ని పట్టించుకోని కిరణ్, నెహ్రూకు సర్టిఫికెట్ ఇచ్చేంతటి వాడు కాదన్నారు. అరుణాచల్ ప్రదేశ్కు ఓ రాష్ట్రంగా గుర్తింపు వచ్చింది, అభివృద్ధి పథంలో నడిచింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనేనన్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలన్నారు. ఎన్డీఏ హయాంలో అరుణాచల్ ప్రదేశ్కు ఏం చేశారో చెప్పాలని గొగోయ్ ప్రశ్నించారు.