: మధుప్రియ జీవితంలో ట్రాజడీ మొదలైంది... కన్న తండ్రిగా నా బాధ అదే!: మల్లేష్
ఓవైపు గాయని మధుప్రియ తన తండ్రితో మాట్లాడలేక కన్నీరు పెట్టిన వేళ, వారి ప్రేమ రెండేళ్ల పాటు సాగలేదని, కేవలం రెండు నెలల పరిచయమేనని ఆమె తండ్రి మల్లేష్ వెల్లడించారు. తనను అడిగి వుంటే తామే దగ్గరుండి వివాహం చేసేవాళ్లమని చెప్పగా, అది నిజమేనని, శ్రీకాంత్ తన తండ్రి దగ్గరకు వచ్చి, "మీ కూతురిని వివాహం చేసుకుంటా" అని ఎన్నడూ అడగలేదని మధుప్రియ ఒప్పుకుంది. అయితే, తాను మాత్రం చెప్పానని వెల్లడించింది. ఓ టీవీ చానల్ లైవ్ ప్రోగ్రామ్ లో మధుప్రియ దంపతులు పాల్గొనగా మధ్యలో, ఆమె తండ్రి మల్లేష్ ఫోన్ ద్వారా మాట్లాడాడు. తండ్రికి హార్ట్ ఎటాక్ వచ్చిందన్నా, మధును వాళ్లు పంపలేదని, ఇక జీవితంలో ఆమె మాటకు విలువనిస్తారని తాను అనుకోవడం లేదని అన్నారు. ఆమె జీవితంలో ట్రాజడీ ప్రారంభమైందని, ఓకన్న తండ్రిగా తన బాధ అదేనని మల్లేష్ అన్నారు. తాను జీవితంలో ఎవరిని తీసుకొచ్చినా, ఆఖరికి కుక్కను తీసుకువచ్చినా కూడా, సంతోషంతో అంగీకరించి వివాహం చేయిస్తానని ఎన్నో మార్లు మధుప్రియకు చెప్పానని ఆయన అన్నారు. దీనిపై స్పందించిన మధుప్రియ, తప్పెవరిదో, ఎవరిది కాదో దేవుడికి తెలుసునని తెలిపింది. తన కూతురిని నిజంగా ప్రేమించిన వ్యక్తి అయితే, శ్రీకాంత్ వచ్చి తనను అడిగేవాడని మల్లేష్ ఆరోపించారు. మార్చి 18న వివాహం జరిపిస్తామని చెప్పినా వినని శ్రీకాంత్ మనసులో చెడు ఆలోచనలు ఉన్నాయని అన్నారు. తన ఇంటిపై గతంలో శ్రీకాంత్ దాడి చేశాడని ఆరోపించారు. తన బిడ్డ బంగారమని, మధుప్రియను తన తల్లిగా చూసుకున్నానని, శ్రీకాంత్ మోసగాడని అన్నారు.