: రూ. 500 కోట్లు అడిగితే, రూ. 9,800 కోట్లు ఇస్తామన్నారు!
రూ. 500 కోట్ల నిధుల సమీకరణ నిమిత్తం మార్కెట్ ను ఆశ్రయించిన ఎస్.హెచ్.కేల్కర్ ఐపీఓ సూపర్ హిట్టయింది. మొత్తం 2.02 కోట్ల ఈక్విటీ వాటాలను విక్రయించేందుకు సంస్థ సిద్ధపడగా, అందుకు 27 రెట్ల అధిక బిడ్లు దాఖలయ్యాయి. మొత్తం 54.60 కోట్ల ఈక్విటీలకు బిడ్లు రాగా, వీటి విలువ రూ. 9,800 కోట్లు. ప్రైవేటు రంగ ఏవియేషన్ సంస్థ, ఇండిగో పేరిట విమానయాన సేవలందిస్తున్న ఇంటర్ గ్లోబ్ ఐపీఓ విధానంలో రూ. 3,100 కోట్ల సమీకరణకు రాగా, విదేశీ ఇన్వెస్టర్ల పుణ్యమాని ఆ డబ్బును సమీకరించుకోగలిగింది. ఇండిగోపై పెద్దగా ఆశ చూపని దేశవాళీ ఇన్వెస్టర్లు ఎస్.హెచ్ కేల్కర్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానించారు. సంస్థ మూలాలు బలంగా ఉండటంతోనే ఈ ఐపీఓకు ఇటీవలి కాలంలో చూడనటువంటి డిమాండ్ వచ్చిందని తెలిపారు. కాగా, ఈ సంస్థ ఒక్కో ఈక్విటీని రూ. 173 నుంచి రూ. 180 మధ్య విక్రయించింది. సబ్బులు, షవర్ జెల్స్, డిటర్జంట్ పౌడర్లు, షాంపూలు, హెయిర్ ఆయిల్స్, పర్ఫ్యూమ్స్ తయారు చేస్తున్న ఈ సంస్థ వాటిని గోద్రేజ్, విప్రో, మారికో సహా 4 వేల కంపెనీలకు అందిస్తోంది. ఎస్.హెచ్ కేల్కర్ అందించే ఈ ఉత్పత్తులను ప్రముఖ సంస్థలు తమ బ్రాండ్ల పేరిట ప్యాక్ చేసుకుని మార్కెట్లో విక్రయిస్తుంటాయి. ఇదిలావుండగా, ఈ సంవత్సరం మొత్తం 18 కంపెనీలు తమ ఈక్విటీలను విక్రయించేందుకు మార్కెట్ కు రాగా, రూ. 11 వేల కోట్ల సమీకరణ జరిగింది.