: ఇంట్లో రూ. 38 లక్షలు దొంగిలించి, ఫ్రెండ్స్ తో పారిపోయి జల్సా చేసిన టీనేజ్ గాళ్!


అతనో బిల్డర్. ఓ లావాదేవీలో భాగంగా రూ. 38 లక్షలు తెచ్చి ఇంట్లోని బీరువాలో ఉంచాడు. ఆపై మంగళవారం నాడు ఆ డబ్బు కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. ఆ తరువాత ఆయన 14 ఏళ్ల కుమార్తె కూడా కనిపించలేదు. గురువారం నాడు కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. ఆ మరుసటి రోజు కుమార్తె స్నేహితులు నలుగురు మాయం అయ్యారు. దీంతో ఆ డబ్బును బిల్డర్ కుమార్తే దొంగిలించి వుండవచ్చని భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాఫ్తు చేసి వారిని ట్రేస్ చేసి క్షేమంగా పట్టుకోవడంతో పాటు రూ. 37 లక్షలు రికవరీ చేశారు. మిగిలిన లక్ష రూపాయలను వీరు 12 గంటల వ్యవధిలో ఖర్చు పెట్టడం గమనార్హం. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. చదువు పేరిట తనపై ఒత్తిడి అధికమైనందునే కొంత మార్పు కోరుకుంటూ ఈ పని చేసినట్టు ఆమె వెల్లడించడంతో పోలీసులు ఏం చేయాలో తోచని స్థితిలో పడిపోయారు. ఈ మొత్తం ఉదంతాన్ని డీసీపీ మన్ దీప్ రంధావా వివరిస్తూ, స్నేహితుల ప్రోద్బలంతో ఆమె దొంగతనం చేసిందని తెలిపారు. వీరు స్మార్ట్ ఫోన్ యాప్ మాధ్యమంగా ఓ టాక్సీని బుక్ చేసుకుని తొలుత నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ కు వెళ్లారని, ఆపై అక్కడ రైళ్లు లేవని తెలుసుకుని అదే టాక్సీలో డెహ్రాడూన్ వెళ్లి, అక్కడి ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో దిగారని తెలిపారు. విచారణలో భాగంగా, రైల్వే స్టేషన్ కు బుక్ చేసుకున్న ఓ క్యాబ్ ఇంకా వెనక్కు రాలేదని తెలుసుకోవడం దర్యాఫ్తులో కీలక మలుపని వివరించారు. టాక్సీ డ్రైవర్ కు ఫోన్ చేస్తే, నలుగురిని తాను డెహ్రాడూన్ లో దింపి బిల్ గా రూ. 11 వేలు తీసుకుని వెనక్కు వస్తున్నట్టు చెప్పాడని, అతనిని తిరిగి అదే హోటలుకు వెళ్లి హోటల్ యాజమాన్యంతో మాట్లాడించాలని కోరామని మన్ దీప్ తెలిపారు. వారు రూ. 10 వేల విలువైన లగ్జరీ సూట్ బుక్ చేసుకున్నారని, ఉదయం నుంచి సాయంత్రం లోగా రూ. 80 వేల విలువైన షూస్, బ్యాగ్స్, డ్రస్సులు కొనుక్కున్నారని పేర్కొన్నారు. హోటల్ సహకారంతో వారిని పర్యవేక్షణలో ఉంచామని, ప్రత్యేక బృందాన్ని పంపి వారిని అదుపులోకి తీసుకుని డబ్బు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ తరహా ఘటనలు పిల్లల పట్ల తల్లిదండ్రుల దృక్పథం మారాల్సిన అవసరాన్ని తెలియజేస్తాయని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News