: విశాఖలో తలదాచుకున్న కృపామణి ఆత్మహత్య కేసు నిందితుడు!
కృపామణి ఆత్మహత్య కేసులో కీలక నిందితుడు గూడాల సాయి శ్రీనివాస్ విశాఖపట్నంలో తలదాచుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నగర పరిధిలోని డాబా గార్డెన్స్ లో ఆయన కారును (ఏపీ 9 బీటీ 7991) స్వాధీనం చేసుకున్న పోలీసులు సాధ్యమైనంత త్వరలో అతనిని అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. సాయి శ్రీనివాస్ ను ఎలాగైనా పట్టుకోవాలని భావిస్తున్న పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. కాగా, తనపై సాయి శ్రీనివాస్ పలుమార్లు అత్యాచారం చేశాడని, వ్యభిచార రొంపిలోకి దింపాలని తన తల్లిదండ్రులతో కలసి కుట్ర పన్నాడని ఆరోపిస్తూ, కృపామణి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. విషయమంతా ఆమె వీడియోలో చెప్పి మరీ ఆత్మహత్యకు పాల్పడటంతో ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.