: రహస్యంగా ఇండియా వచ్చి వెళ్లిన 'టైటానిక్' హీరో, ఎందుకంటే..!
టైటానిక్, ది వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ చిత్రాల హీరో లియొనార్డో డికాప్రియో రహస్యంగా ఇండియా వచ్చి వెళ్లాడు. శనివారం ఉదయం 7:15 గంటలకు ఆగ్రాకు వచ్చి ఆయన, ప్రేమకు చిహ్నంగా నిలిచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తాజ్ మహల్ వద్ద రెండు గంటలకు పైగా గడిపాడు. తనను ఎవరూ గుర్తు పట్టని విధంగా, ఓ క్యాప్, నల్ల కళ్లద్దాలు ధరించి వచ్చిన ఆయన చుట్టూ సాధారణ దుస్తుల్లో బాడీగార్డ్స్ ఉన్నారు. ఆయన్ను ఎవరైనా గుర్తు పట్టిన ప్రతి సందర్భంలో, బాడీగార్డులు అడ్డుకుని వారిని దూరంగా పంపారు. ఎవరినీ ఫోటోలు తీయనీయలేదని తెలుస్తోంది. అనంతరం లియొనార్డో ఢిల్లీకి బయలుదేరి వెళ్లాడు. కేవలం తాజ్ అందాలను తిలకించేందుకే ఆయన వచ్చినట్టు సమాచారం.