: రిటైర్మెంట్ పై మనసులోని ఆవేదన బయటపెట్టిన సెహ్వాగ్
టీమిండియా డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రిటైర్మెంట్ పై తన మనసులో మాటను బయటపెట్టాడు. 'ఆజ్ తక్' ఛానెల్ నిర్వహించే 'ఆప్ కీ అదాలత్' కార్యక్రమంలో మాట్లాడుతూ, రిటైర్మెంట్ బాధ మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నాడు. ఢిల్లీలో ఒక టెస్టు ఆడేందుకు అవకాశం ఇవ్వాలని కోరినా తనకు అవకాశం ఇవ్వలేదని వీరూ తెలిపాడు. క్రికెట్ ఆడుతుండగానే రిటైర్ కావాలని భావించానని, అలా జరగలేదని, ఆ వెలితి అలాగే మనసులో నిలిచిపోతుందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. తన జీవితంలో ఆట ఓ భాగంగా సాగిందని, ఎప్పటి వరకు ఆడాలి? ఎప్పుడు రిటైర్ కావాలి? అనేది నిర్ణయించుకోలేకపోయానని సెహ్వాగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు తనను జట్టులోంచి తొలగించే వరకు రిటైర్మెంట్ ఆలోచనే రాలేదని సెహ్వాగ్ తెలిపాడు. కేవలం ఆ కారణంగానే తన వీడ్కోలు ఇలా జరిగిందని సెహ్వాగ్ బాధపడ్డాడు. ఇక జట్టులోకి తీసుకోవడం కుదరదు అని ముందుగానే చెప్పి ఉంటే తన నిర్ణయం ఇంకోలా ఉండేదని సెహ్వాగ్ తెలిపాడు.