: విమానం కూలడానికి కారణం అదే... సిబ్బంది, ప్రయాణికులు అంతా రష్యన్లే!
సినాయ్ పర్వత ప్రాంతాల్లో ఈ రోజు రష్యన్ విమానం సాంకేతిక కారణంతోనే కూలిపోయిందని అధికారులు పేర్కొన్నారు. అయితే, దీనిని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. విమానం బయల్దేరిన కాసేపటికే సాంకేతిక లోపం గుర్తించిన పైలట్ గాజాలోని ఎల్ ఎరిష్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించాడు. సాంకేతిక లోపం తలెత్తిన తరువాత విమానం నిమిషానికి 1500 మీటర్ల ఎత్తున కిందికి పడిపోయిందని అధికారులు పేర్కొన్నారు. విమానం ల్యాండ్ చేసే ప్రయత్నంలో విమానం కూలిపోయినట్టు కైరో అధికారులు తెలిపారని రష్యా పేర్కొంది. విమానంలో పని చేస్తున్న ఏడుగురు సిబ్బంది, 217 మంది ప్రయాణికులు అంతా రష్యన్లేనని ఈజిప్టు అధికారులు వెల్లడించారు. కాగా, ఈ విమాన శకలాల్లోంచి వంద మృత దేహాలను వెలికి తీసినట్టు అధికారులు తెలిపారు. కాగా, విమానం బ్లాక్ బాక్స్ ను అధికారులు గుర్తించారు. దీంతో విమానం కూలిపోవడానికి కారణాలు తెలిసినట్టేనని అధికారులు చెప్పారు.