: గుంటూరు వాసులూ...మీ పిల్లల ఇంటర్నెట్ వినియోగం ఎలా ఉందో చెక్ చేసుకోండి!
ఇంటర్నెట్ వినియోగం విస్తృతమైంది. డెస్క్ టాప్ ఇంట్లో ఉంటే గ్రేట్ అనుకునే స్ధాయి నుంచి ఇప్పుడు ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్లలోనే ఇంటర్నెట్ వినియోగించే స్ధాయికి చేరుకున్నాం. సోషల్ మీడియా ప్రభావంతో తీరిక దొరకడం లేదు. కామెంట్ పెట్టడం, దానికి వచ్చిన లైకులు, కామెంట్లు, షేర్ల సంఖ్య చూసుకోవడానికే సమయం సరిపోతోంది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో పిల్లల ఇంటర్నెట్ వినియోగంపై ఓ సంస్థ సర్వే చేసింది. ఈ సర్వేలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. మీ పిల్లల ఇంటర్నెట్ వాడకంపై ఓ కన్నేశారా? అని తల్లిదండ్రులను ప్రశ్నించగా 77 శాతం లేదని చెప్పారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 5 లక్షల మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఉండగా, వారిలో 67 శాతం మంది యువకులు, విద్యార్థులేనని ఈ సర్వే వెల్లడించింది. నెలకు సగటున వీరు 3 కోట్ల రూపాయల వరకు ఇంటర్నెట్ సేవలు వినియోగించేందుకు ఖర్చు చేస్తున్నారంటే ఆశ్చర్యం కలుగకమానదు. 55 శాతం మంది విద్యార్థులు తమ ఇంటర్నెట్ వినియోగం వివరాలను తల్లిదండ్రుల ముందు ఉంచుతున్నారని సర్వే వెల్లడించింది. 28 శాతం మంది మాత్రం ఇంటర్నెట్ వినియోగం హిస్టరీ తొలగిస్తున్నారని సర్వే వెల్లడించింది. పాస్ వర్డ్స్ ను తల్లిదండ్రులతో పంచుకునే విద్యార్థులు 44 శాతం మంది మాత్రమేనని సర్వే పేర్కొంది. ఇంటర్నెట్ వినియోగిస్తున్న యువత, విద్యార్థుల్లో 74 శాతం మంది అపరిచితులతో అప్రమత్తంగా ఉంటున్నారని సర్వే వివరించింది. ఇంటర్నెట్ వినియోగంలో తమ పిల్లలపై 64 శాతం మంది తల్లిదండ్రులు విశ్వాసం వ్యక్తం చేశారు. సైబర్ నేరాలపై 22 శాతం మంది అప్రమత్తంగా ఉండాలని తమ పిల్లలను హెచ్చరిస్తున్నట్టు తెలిపారు. ఇంటర్నెట్ ను సరైన రీతిలో వినియోగిస్తే సత్ఫలితాలు వస్తాయని 80 శాతం మంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారని ఆ సర్వే వెల్లడించింది.