: సంచలన వ్యాఖ్యలు చేసిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి
గోమాంస భక్షణ అనే అంశం నేపథ్యంలో సామాన్యుడి దగ్గర నుంచి సెలబ్రిటీలు, రాజకీయవేత్తల వరకు ఎవరికి తోచిన వ్యాఖ్యలు వారు చేస్తున్నారు. గోమాంసం పేరుతో ఒక మతాన్ని టార్గెట్ చేస్తున్నారని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఆవును తినాలనుకుంటున్నవారు ఇక్కడ బతకాల్సిన అవసరం లేదని మరికొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో, ఈ అశంపై తొలిసారి ఓ వ్యాపారవేత్త తన స్పందనను తెలియజేశారు. ఆయనే ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని మైనార్టీల్లో భయాందోళనలు నెలకొన్నాయని ఆయన తెలిపారు. దేశ ఆర్థిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని సూచించారు. మతాల మధ్య కాని, ప్రాంతాల మధ్య కాని సామరస్యం ఉండాలని చెప్పారు. నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టేలా ఉండటంతో... ఈ అంశం చర్చనీయాంశం అయింది.