: నెల్లూరులో బారాషహీద్ దర్గాను సందర్శించుకున్న చంద్రబాబు... ప్రత్యేక ప్రార్థనలు


నెల్లూరు నగరంలో ఇవాళ పర్యటించిన సీఎం చంద్రబాబు స్థానిక బారా షబీద్ దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ, స్వర్ణాల చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు వెంగళరావు నగర్ లో సీఎం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు కుటుంబాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తాగునీరు సక్రమంగా రావట్లేదని మహిళలు సీఎంకు ఫిర్యాదు చేయడంతో నగరపాలక సంస్థ అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బ్రహ్మానందపురంలో పారిశుద్ధ్య నిర్వహణ తీరుపై నగర కమిషనర్, ఆర్ అండ్ బీ అధికారులపై మండిపడ్డారు. పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకుంటే ఊరుకునేది లేదని, పౌరులకు సరైన సౌకర్యాలు అందాలని స్పష్టం చేశారు. తాగునీటి సరఫరాకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో రాజీపడేది లేదన్నారు. పేదవారికి మెరుగైన సదుపాయాల కల్పనే తమ ధ్యేయమన్న సీఎం, కాల్వలు, రహదారులు కబ్జా చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News